జగన్‌ను ర్యాగింగ్ చేసిన విజయసాయి!
విజయవాడ ,అక్టోబరు 21 (అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 21.)
మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి దసరా పండుగ సందర్భంగా తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన ముహూర్తాన్ని, ఆశయాలను వెల్లడిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలకడం, కులపిచ్చి, మతపిచ్చి రాజకీయాలను రూపుమాపడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం, రప్పారప్పా ఫ్యాక్షన్ల నుంచి విముక్తి కల్పించి, కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని దసరా పండుగరోజు మాజీ ఎంపీ ప్రకటించారు.విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ ప్రకటన తేదీని, ముహుర్తాన్ని ప్రకటించారు. అన్నీ పదకొండులు వచ్చేలా చూసుకున్నారు. గతంలో దసరాకే పార్టీ పెడతానని చెప్పిన ఆయన .. పార్టీ పెట్టే రోజును దసరా రోజునుప్రకటించారు. ఆ రోజును, ముహుర్తాన్ని చూస్తే ఆయన జగన్ రెడ్డిని ర్యాగింగ్ చేశారని సులువుగా అర్థమైపోతుంది. 11వ నెల 11వ తేదీన సరిగ్గా ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌లో నూతన పార్టీని ఘనంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు.గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలై కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అప్పట్నుంచి 11 అంటే వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. విపక్ష హోదా కూడా దక్కకుండా చేసిన ఆ 11 సంఖ్య జగన్‌కు, వైఎస్సార్సీపీ శ్రేణులకు రాజకీయంగా ఒక పెద్ద పీడకలగా మారింది. అలాంటి పచ్చి పుండుపై కారం చల్లేలా.. విజయసాయిరెడ్డి తన పార్టీ ప్రకటన ముహూర్తంలో నెల, తేదీ, గంటలు, నిమిషాలు అన్నీ కలిపి వరుసగా 11:11:11:11 వచ్చేలా పక్కాగా సెట్ చేశారు. గతంలో జగన్‌కు ఆర్థిక, రాజకీయ సలహాదారుగా నిలిచి లెక్కల మాస్టారు గా పేరుగాంచిన సాయిరెడ్డి.. ఇప్పుడు అదే లెక్కలతో జగన్ ఓటమి సంఖ్యను గుర్తుచేస్తూ పబ్లిక్‌గా ట్రోల్ చేశారుకేవలం ముహూర్తంతోనే ఆగకుండా పార్టీ ఎజెండా ద్వారా కూడా జగన్ పాలనను, వైఎస్సార్సీపీ మూలాలను విజయసాయిరెడ్డి తీవ్రంగా ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలికేలా.. రప్పరప్ప ఫ్యాక్షన్ల నుంచి విముక్తి కల్పించేలా.. జెన్-జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా తమ పార్టీ వస్తోందని పోస్టర్లో పేర్కొనడం జగన్‌ను నేరుగా టార్గెట్ చేయడమే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత ప్రయోజనాలు చూసుకున్నారని, యువతను కేవలం జేజేలు కొట్టే గుంపులుగా మార్చారని దశకంఠుడి అవలక్షణాలంటూ 10 పాయింట్లతో జగన్ రాజకీయ తీరును ఉతికి ఆరేశారు. నిన్నటిదాకా తమతో ఉన్న ముఖ్య నేతే ఇలా 11 నంబర్‌తో వ్యంగ్యాస్త్రాలు సంధించడం తాడేపల్లి ప్యాలెస్‌కు మింగుడుపడటం లేదుకొన్ని రోజుల కిందట విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావం ప్రకటన చేయాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానన్నారు. అయితే వైసీపీ నుంచి బెదిరింపులకు పాల్పడటంతో ఆయన వెనక్కి తగ్గారని, మరికొన్ని వర్గాల వారు విజయసాయిరెడ్డిని భయపెట్టడంతో మాజీ ఎంపీ వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ పెట్టడంలో వెనక్కి తగ్గేదిలేదని, తనను ఎవరూ బెదిరించలేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం కచ్చితంగా తన పోరాటం కొనసాగుతుందన్నారు.